ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెరగవు – టీటీడీ

March 4, 2022 0 Comments


తిరుమలలో ఇటీవల ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచుతున్నట్టు వార్తలొచ్చాయి. అయితే కేవలం టీటీడీ బోర్డ్ మీటింగ్ లోనే దానిపై చర్చ జరిగిందని, టికెట్ల ధరలు పెంచే ఆలోచన లేదని అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నసత్రంతోపాటు మరో రెండు చోట్ల అన్నప్రసాద వితరణ కేంద్రాలు ప్రారంభించబోతున్నట్టు చెప్పారాయన. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామన్నారు.

భక్తుల రద్దీ పెరిగింది..
కొవిడ్ ఇబ్బందులు తగ్గడంతో పదిరోజుల క్రితం తిరుమలలో సామాన్య భక్తులకు సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీ పెరిగినా అన్న ప్రసాద వితరణకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామన్నారు.

ఏప్రిల్ నుంచి సేవలు..
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను ఏప్రిల్ నుంచి తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. ఆర్జిత సేవలు సహా మరే ఇతర సేవల టికెట్ రేట్లను పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సామాన్య భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనాన్ని కల్పించడమే పాలకమండలి ముఖ్య ఉద్దేశమని చెప్పారాయన. వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వైవీ సుబ్బారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అన్నప్రసాదం నాణ్యతను పరిశీలించిన అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ కి వెళ్లారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *