మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం – మంత్రి బొత్స

March 3, 2022 0 Comments


సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాల్సిందేనంటూ హైరోక్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీఎం జగన్.. నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానం అన్నారాయన. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని గతంలో పార్లమెంట్ లో కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు బొత్స. హైకోర్టు తీర్పుపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.

సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాలని హైకోర్టు చెప్పిందని, దానికి తాము వ్యతిరేకం కాదని చెప్పారు. ఖర్చు, సమయం పరిగణనలోకి తీసుకుని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని అంటే కేవలం భూమి, అక్కడి సామాజిక వర్గమే కాదని, అది రాష్ట్రంలోని 5కోట్ల మందికి సంబంధించిన అంశమని చెప్పారు. ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏదైనా సమాజం కోసం చేయాలని, సామాజిక వర్గం కోసం కాదన్నారు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలన్నారు. రాజధాని ప్రాంతంలో ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించారు.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ప్రస్తుతం లేదని భావిస్తున్నట్టు తెలిపారు మంత్రి బొత్స. న్యాయనిపుణులతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడ్డంకులు తొలగించుకుని అందరికీ ఆమోదయోగ్యమైన బిల్లు తెస్తామని స్పష్టం చేశారు.

తాకట్టు అవాస్తవం..
రాజధాని ప్రాంత రైతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని, రైతులకు చేయాల్సినవన్నీ చేస్తున్నామని అన్నారు మంత్రి బొత్స. రాజధాని భూములను ఇతర అవసరాల కోసం ఎక్కడా తాకట్టు పెట్టలేదని వివరణ ఇచ్చారు. రాజధాని భూములను చంద్రబాబు హయాంలోనే తనఖా పెట్టారని గుర్తు చేశారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో మూడు రాజధానులపై కొత్త బిల్లు పెడతామో లేదో మీరే చూస్తారంటూ మీడియా సమావేశంలో ముక్తాయించారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *