భారత్ కు వినికిడి లోపం.. | teluguglobal.in

March 3, 2022 0 Comments


ఇటీవల భారత్ లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. గుండె సమస్యల వారు, క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఇప్పుడో సర్వే మరో ఉపద్రవాన్ని బయటపెట్టింది. భారత్ లో వినికిడి సమస్య ఉన్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతోందనే విషయాన్ని కుండబద్దలు కొట్టింది. ఇదే క్రమంలో ఈ సమస్య పెరిగి పెద్దదైతే.. 2050నాటికి భారత్ లోని ప్రతి నలుగురిలో ఒకరికి వినికిడి సమస్య ఉంటుందని అంచనా వేస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారత్ లో ప్రస్తుతం 6.3కోట్లమంది ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. మరో ఆరుకోట్ల మందికి ఈ సమస్య ఉన్నా.. దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. సమస్య ఉందని గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు వెదికేవారు ఎంతమంది ఉంటారో.. అదే సంఖ్యలో సమస్యను అసలు గుర్తించలేని స్థితిలో ఉన్నవారు కూడా కనిపిస్తారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వివరాల ప్రకారం లక్షమంది జనాభాలో 291మందికి తీవ్రమైన వినికిడి సమస్య ఉంది. వీరిలో ఎక్కువ శాతం మంది 0-14 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు కావడం విశేషం.

ప్రతి ఏటా భారత్ లో 27వేలమంది పిల్లలు పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిక్ బాధితుల్లో 50సంవత్సరాలు దాటిన వారికి వినికిడి సమస్య ఎక్కువగా ఉంటోంది. 50ఏళ్లు దాటిన షుగర్ వ్యాధి గ్రస్తుల్లో 70శాతం మందికి వినికిడి సమస్య ఉందని సర్వేలు చెబుతున్నాయి.

శబ్దకాలుష్యం..
నగరాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాహనాల వల్ల తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. దీనితోపాటు ఇతరత్రా ఇన్ ఫెక్షన్ల సమస్యతో వినికిడి లోపం ఏర్పడుతోంది. భారత్ లో ప్రతి వెయ్యి జనాభాలో ఒకరినుంచి ముగ్గురు వినికిడిలోపంతో పుడుతున్నారని తెలుస్తోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *