వలిమై మూవీ రివ్యూ | teluguglobal.in

February 24, 2022 0 Comments


నటీనటులు: అజిత్, కార్తికేయ, హుమా ఖురేషి
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజ, గిబ్రాన్
కెమెరామెన్ : నిరావ్ షా
ఎడిటింగ్ : విజయ్ వేలుకుట్టి
నిర్మాణం : బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
నిర్మాత : బోణీ కపూర్
నిడివి : 178 నిమిషాలు
దర్శకుడు : వినోద్
రేటింగ్ : 2/5

ఓ పెద్ద హీరో సినిమా చేస్తున్నాడంటే మినిమం కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అంచనాలు అందుకోకపోయినా కనీసం ఓ మంచి కథ, స్క్రీన్ ప్లే అయినా ఉంటాయని అనుకుంటాం. కానీ ఆశ్చర్యంగా వాలిమై సినిమాలో అలాంటివేం కనిపించవు. 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన అజిత్, ఈ కథను ఎలా అంగీకరించాడా అనిపిస్తుంది. ఖైదీ లాంటి క్లాసిక్ తీసిన వినోద్ ఇంత నాసిరకం కథను ఎలా సెలక్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే.. వాలిమై సినిమా ఏ ఒక్క అంశంలోనూ మెప్పించదు.

ముందుగా కథ చెప్పుకుందాం.. ఎందుకంటే స్టోరీ ఏంటనేది లైట్ గా తెలిస్తే ఇది ఎంత పాతకాలం నాటి కథో మీకు ఈజీగా అర్థమౌతుంది. వైజాగ్ లో కొందరు బైక్ రైడర్స్ డ్రగ్స్ మత్తులో డబ్బు కోసం మహిళల మెడ నుంచి బంగారం దోచుకుంటుంటారు. అవసరమైతే మర్డర్లు కూడా చేస్తారు. ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్ మెంట్ పై తీవ్ర ఒత్తిడి రావడంతో అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ (అజిత్)ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసి చైన్ దొంగతనాల కేసుని అప్పగిస్తారు. అలా కేసుని హ్యాండిల్ చేసే క్రమంలో అర్జున్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు.. అసలింతకీ ఈ అరాచకాలకు పాలుపడుతున్న ముఠా వెనుక ఉన్నది ఎవరు.. అతడి టార్గెట్ ఏంటనేది ఈ సినిమా స్టోరీ.

ఓ 40 ఏళ్లు వెనక్కి వెళ్దాం. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ సినిమాలు చాలా ఫేమస్. ఆయన సినిమాల క్లైమాక్స్ లో అమ్మా-చెల్లెలు-తమ్ముడు-ప్రేయసిని విలన్ అపహరిస్తాడు. ఓ డెన్ లో వాళ్లను తాళ్లతో కట్టి పడేస్తాడు. అప్పుడు తాపీగా హీరో ఎంటర్ అవుతాడు. విలన్లను కొట్టి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో కామన్ అయిపోయిన ఈ సన్నివేశాన్ని, అజిత్ సినిమాలో పెట్టారు. ఇంత పాత సన్నివేశాన్ని హీరోకు చెప్పి దర్శకుడు ఎలా ఒప్పించాడనేది ఇక్కడ డిస్కషన్ పాయింట్. అజిత్ ఎందుకు నో చెప్పలేకపోయాడనేది అతిపెద్ద క్వశ్చన్.

వినోద్ లో టాలెంట్ పుష్కలంగా ఉంది. కాకపోతే ఈసారి ఆయన తన టాలెంట్ కంటే అజిత్ స్టార్ డమ్ నే ఎక్కువగా నమ్ముకున్నాడు. అందుకే స్క్రీన్ ప్లే కంటే యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే సినిమాలో ఫైట్స్ మాత్రమే క్లిక్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమాకు దర్శకుడు అవసరం లేదు. ఇద్దరు స్టంట్ మాస్టర్లను పెట్టుకుంటే పని జరిగిపోయేది.

ఈ పాత చింతకాయ పచ్చడి కథను కనీసం రెండున్నర గంటల్లో ముగించాలనే ఆలోచన కూడా చేయకపోవడం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్. దాదాపు 3 గంటలున్న ఈ సినిమాను భరించడం ప్రేక్షకుడికి నరకప్రాయం. వచ్చిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం, ఇదివరకే వందల సార్లు చూసేసిన సీన్లు, డైలాగులు మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం చూసి మనల్ని మనమే తిట్టుకుంటాం. ఇక సెంటిమెంట్ కోసం పెట్టిన అమ్మ ఎపిసోడ్ చూస్తే మనపై మనకే అసహ్యం వేస్తుంది.

అజిత్ లాంటి నటుడికి పరీక్ష పెట్టే సన్నివేశం ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. స్వతహాగా రేసర్ కావడంతో యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు. అంతకుమించి అజిత్ నుంచి ఆశించడానికేం లేదు. చివరికి పాటల్లో మంచి స్టెప్పులు కూడా వేయలేదు ఈ హీరో. విలన్ గా నటించిన కార్తికేయ గురించి కూడా చెప్పడానికేం లేదు. వలిమైలో విలన్ గా నటించడానికి తెగ కష్టపడ్డాడు కార్తికేయ. అయితే ఆ కష్టమంతా తన బాడీని చూపించడంపైనే పెట్టాడు తప్ప, నటనలో చూపించలేదు. నార్కొటిక్ ఆఫీసర్ గా హుమా ఖురేషీ నటన ఓకే.

టెక్నీషియన్లు విషయానికొస్తే, ముందుగా ఎడిటర్ గురించే చెప్పుకోవాలి. అస్సలు ఆలోచించకుండా, ఏమాత్రం బుర్ర పెట్టకుండా ఎడిటర్ పనిచేసినట్టున్నాడు. ఓ సాధారణ ఎడిటర్ కు ఈ సినిమా ఇచ్చినా కనీసం గంట కోసి పడేస్తాడు. అంత బోరింగ్ గా ఉంది ఎడిటింగ్. యువన్ శంకర్ రాజా, గిబ్రాన్ లాంటి ఇద్దరు సంగీత దర్శకులు పనిచేసి కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే.

ఓవరాల్ గా యాక్షన్ సన్నివేశాలు మినహా వాలిమైలో ఏదీ లేదు. వాటి కోసం సినిమాకెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం.Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *