గుజరాత్​ సీఎం రాజీనామా వెనక.. అసలు కారణం ఏమిటి?

September 11, 2021 0 Comments


గుజరాత్​లో శనివారం ఉన్నట్టుండి అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకున్నది. అక్కడి సీఎం విజయ్​ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఈ రాజీనామాను ఎవరూ ఊహించలేదు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టు విజయ్​ రూపానీ ప్రకటించారు. తాను ప్రధాని మోదీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన నరేంద్రమోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు గుజరాత్ సొంత రాష్ట్రమన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది.

మరో ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్​ రూపానీ రాజీనామా ఆసక్తికరంగా మారింది. బీజేపీ హైకమాండ్​ ఓ బలమైన కారణంతో విజయ్​ రూపానీతో రాజీనామా చేయించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిలో గుజరాత్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతేకాక అక్కడ బీజేపీ కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది.

ఓ వైపు పటేల్​ సామాజిక వర్గం ఆ పార్టీకి క్రమంగా దూరమైంది. హార్దిక్ పటేల్​.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పటేళ్లకు రిజర్వేషన్లు తీసుకొచ్చే అంశాన్ని తార స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్​ వెంట ఉన్నారు. మరోవైపు విజయ్​ రూపానీ పెద్దగా మాస్​ ఫాలోయింగ్​ ఉన్న లీడర్​ కాదు.. ఈ క్రమంలో ఆయనను నమ్ముకుంటే గుజరాత్​ ఎన్నికలు జయించడం కష్టమని బీజేపీ హైకమాండ్​ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం గుజరాత్ లో దళితులు, పటేళ్లు బీజేపీకి దూరమయ్యారు. ముస్లింలు ఎలాగూ ఆపార్టీకి మద్దతు ఇవ్వరు. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్​ రూపానీ స్థానంలో పటేల్​ సామాజికవర్గానికి చెందిన నేతను సీఎం పీఠం ఎక్కిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, సీఆర్‌ పటేల్, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఆర్‌సి ఫాల్దూ సీఎం రేసులో ఉన్నట్టు సమాచారం. గుజరాత్​లో పటేల్​ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకొనేందుకు బీజేపీ హైకమాండ్​ ఎత్తులు వేస్తోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *