శశికళకు షాక్.. 100కోట్ల ఆస్తులు జప్తు..

September 9, 2021 0 Comments


అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత నెచ్చెలి శశికళకు ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు షాకిచ్చారు. ఆమెకు చెందిన రూ.100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. చెన్నై శివారు గ్రామం పయ్యనూర్ లో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ క్రమంలో ఇదే కేసులో భాగంగా ఇప్పుడు ఆస్తుల జప్తు సంచలనంగా మారింది.

అప్పుడు 20లక్షలు.. ఇప్పుడు 100కోట్లు..
శశికళనుంచి ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.100కోట్లు అని తెలుస్తోంది. అయితే ఆ ఆస్తుల విలువ 20లక్షలుగా ఉన్నప్పుడు శశికళ వాటిని కొనుగోలు చేశారు. 1991-96 మధ్య తమిళనాడుకి జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ ఈ ఆర్థిక లావాదేవీలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కొనుగోళ్లలో కూడా పలు బెదిరింపులు, అక్రమాలు జరిగినట్టు సమాచారం.

1991 జూలై నుంచి 1996 ఏప్రిల్‌ వరకు శశికళ బంధువు ఇళవరసి, వీఎన్‌ సుధాకరన్‌ పేర్ల మీద భారీగా ఆస్తుల కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. 2017లో వీరికి చెందిన 187 ఆస్తులపై తనిఖీలు జరిగాయి. రూ.1,430 కోట్ల పన్ను చెల్లించలేదని శశికళపై అభియోగాలు ఉన్నాయి. 2019లో రూ.1,600 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. చెన్నెలో శశికళకు సంబంధించిన 65 ఆస్తులను గతేడాది ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. 2014లో కర్నాటక కోర్టు ఇచ్చిన తీర్పులో శశికళకు చెందిన ఈ 11 ఆస్తుల్ని కూడా ఆదాయానికి మించిన అక్రమాస్తులుగా పేర్కొన్నారు. ఈ 100 కోట్ల ఆస్తిని తాజాగా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.

తమిళనాడు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న శశికళ మరోసారి ఆస్తుల స్వాధీనం వ్యవహారంతో తెరపైకి వచ్చారు. ఇటీవల ఆమె అన్నాడీఎంకే నేతల్ని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆమెను కలసినా, ఫోన్ లో మాట్లాడినా వేటు వేస్తామని అన్నాడీఎంకే అధినేతలు పార్టీ నేతలకు ఆల్రడీ వార్నింగ్ ఇచ్చారు. అటు అధికారం లేక, ఇటు ఆస్తులూ దూరమై.. ప్రస్తుతం శశికళ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *