చెట్లకు పెన్షన్.. హర్యానా కొత్త రకం స్కీమ్

June 8, 2021 0 Comments


భూమిపై తాపం పెరుగుతోంది. చెట్లు, అడవులు కరువైపోతున్నాయి. దీనికి తోడు మన దేశంలో ఆక్సిజన్ కూడా కరువైంది. ఆక్సిజన్ లేక కోవిడ్ రోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. అయితే ఫ్యూచర్ లో ఇలాంటి ఆక్సిజన్ లోటు ఉండకూడదని హర్యానా ప్రభుత్వం ఓ కొత్తరకం పాలసీని అమలు చేస్తుంది. అదేంటంటే..

హర్యానా ప్రభుత్వం ‘ప్రాన్ వాయు దేవతా పెన్షన్ స్కీమ్(పివిడిపిఎస్)’, ‘ఆక్సి వన్ (ఆక్సిజన్ అడవులు)’ అనే రెండు కొత్త ప్రాజెక్ట్‌లను మొదలుపెడుతోంది. ఈ పథకంలో భాగంగా.. వయసు పైబడిన వృద్ధులకు పెన్షన్ అందిస్తున్నట్టుగానే.. 75 సంవత్సరాలు పైబడిన చెట్లకు కూడా పెన్షన్ ఇవ్వనుంది. ఎక్కువ వయసున్న పెద్ద పెద్ద చెట్ల నిర్వహణ కోసం, పివిడిపిఎస్ పథకం కింద సంవత్సరానికి 2,500 రూపాయల పెన్షన్ అందించనుంది. ఏళ్లపాటు బతుకుతూ.. ప్రాణవాయువు ఉత్పత్తి చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్ల వెంట నీడను అందించడం లాంటి సేవలందిస్తున్న చెట్లను గౌరవిస్తూ.. అలాగే భవిష్యత్తు అవసరాలను గుర్తిస్తూ.. హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 75 ఏళ్లు దాటిన పాత చెట్లను గుర్తించి వాటి పెంపకం కోసం చెట్టుకు 2,500 రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీలకు ‘పెన్షన్’ గా అందిస్తారు. ఇదే ప్రాన్ వాయు దేవతా పెన్షన్ స్కీమ్.
ఇకపోతే ఆక్సివన్ అనే కొత్త పథకం కింద హర్యానా రాష్ట్రమంతటా అడవులు పెంచడానికి కొంత భూమిని సేకరించి 3 కోట్ల చెట్లు, 8 లక్షల హెక్టార్ల భూమిలో 10శాతం ఆక్సి ఫారెస్ట్‌లు ప్రారంభించనున్నారు.

ఇందులో అందమైన అడవి, పక్షుల అడవి, ధ్యాన అడవి, హెర్బల్ అండ్ హీలింగ్ అడవి, జలపాతాల అడవి లాంటి రకరకాల అడవులని ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తగా భూతాపాన్ని తగ్గించడానికి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని నివారించడానికి ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *