ఆనందయ్యను సీక్రెట్​గా ఎక్కడికి తీసుకెళ్లారు..! | teluguglobal.in

May 29, 2021 0 Comments


ఆనందయ్య .. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్​ భారతదేశంలోనూ ఈ పేరు మారుమోగిపోతున్నది. అందుకు కారణం కరోనాకు ఆయన తయారుచేసిన మందు. అసలు ఆనందయ్య తయారుచేసింది మందే కాదు.. కేవలం హెర్బల్​ ప్రొడక్ట్​ అనే వాళ్లు కూడా ఉన్నారు. కాదు అది పసరుమందు అని వాదించేవాళ్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఆనందయ్య వారం రోజుల తర్వాత నిన్న కృష్ణపట్నం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన గ్రామానికి వచ్చిన రెండు గంటలకే పోలీసులు ముత్తుకూరుకు చేరుకున్నారు. మళ్లీ ఆయన్ను తీసుకెళతారేమోనని గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఇవాళ తెల్లవారు జామున మళ్ళీ గ్రామానికి చేరుకున్న పోలీసులు ఆనందయ్యను ప్రత్యేక బందోబస్తు మధ్య ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

ఆనందయ్య మందు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నదని సోషల్ మీడియాలో ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భారీగా నెల్లూరు జిల్లాకు తరలివెళ్తున్నారు. దీంతో నిన్న ఆనందయ్య ఓ వీడియోను విడుదల చేశారు. తన మందుకు ఇంకా అనుమతి రాలేదని .. అనుమతి వచ్చాక పంపిణీ ప్రారంభిస్తానని చెప్పారు.

కొన్ని మీడియా సంస్థలు.. కొందరు హేతువాదులు ఆనందయ్య ఇచ్చేది అసలు మందేకాదని.. అలా మందు పంపిణీ చేయడం చట్టవిరుద్ధమని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఆనందయ్య తయారుచేసింది మందును నమ్ముతున్నారు. దాని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 70 వేల మందికి ఈ మందు వేశారని.. ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదని ప్రచారం సాగుతోంది. లేదు ఈ మందు తీసుకుని కొంతమందికి అనారోగ్యం కలిగిందని హేతువాదులు వాదిస్తున్నారు.

మొత్తానికి ఆనందయ్య తయారుచేసిన మందుకు విపరీతమైన క్రేజ్​ వచ్చింది. అందుకు మీడియా, సోషల్​ మీడియా ప్రధాన కారణం. కృష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరులో ఆనందయ్య మందును తయారుచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడికి జనం పోటెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది.

ఆనందయ్య మందును ఏపీ ఆయుష్​ శాఖ పరిశీలిస్తున్నది. ఈ మందులో ఎటువంటి హానికారకాలు లేవని ఇప్పటికే ఆయుష్ శాఖ నివేదిక ఇచ్చింది. మరోవైపు కోర్టు సైతం ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది. ఆనందయ్య మందుపై ప్రభుత్వం ఏదో ఒక విషయం తొందరగా తేల్చాలని ఆదేశించింది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *