థర్డ్ వేవ్ ని ఎదుర్కోవ‌డానికి మేం రెడీ..

May 24, 2021 0 Comments


సెకండ్ వేవ్ కాస్త నెమ్మదిస్తున్న క్రమంలో.. థర్డ్ వేవ్ ముప్పు గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో, భావి తరాన్ని కాపాకుడునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అడుగు ముందుకేశాయి. గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కూడా ఆయా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి.

ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కలిపి ఇప్పటి వరకూ భారత్ లో పదేళ్లలోపు పిల్లల్లో 8,66,187 మంది కోవిడ్ బారిన పడ్డారని అధికారిక సమాచారం. ఆ వయసు పిల్లల్లో ఇది కేవలం 3.33 శాతం మాత్రమే. ఫస్ట్ వేవ్ వృద్ధుల్ని, సెకండ్ వేవ్ యువత, మధ్యవయస్కులను, టార్గెట్ చేసినట్టు థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేశాయి. సెకండ్ వేవ్ ని సరిగా అంచనా వేయలేకే భారత్ తీవ్ర ఇబ్బంది పడిందనేమాట వాస్తవం, అందుకే థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ లో వస్తుందని అంచనా వేస్తున్న ఈ ఉపద్రవానికి చెక్ పెడతామంటున్నాయి. సెకండ్ వేవ్ గుణపాఠంతో కేంద్రం వైపు ఆశగా చూడకుండా.. ఈ దఫా రాష్ట్రాలే తమ ఏర్పాట్లలో తలమునకలయ్యాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేశామంటోంది. వైద్య వ్యవస్థ బలోపేతం, కఠినంగా కోవిడ్‌ నిబంధనల అమలు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చూడటం.. ఇదీ మహారాష్ట్ర త్రిముఖ వ్యూహం. ఇప్పటికే ముంబైలో చిన్నారుల కోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. థర్డ్ వేవ్ మొదలయ్యే నాటికి వీటిని పెంచుతామంటున్నారు అధికారులు. మహారాష్ట్రలోని ఇతర జిల్లాల్లోనూ చిల్డ్రన్‌ ప్రొటెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల్లో ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తాజాగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో కరోనా కేసుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. కర్నాటక ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పీడియాట్రిక్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.

తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల కోసం పునరావాస కేంద్రాలను సిద్ధం చేసింది. గోవా ప్రభుత్వం కూడా థర్డ్ వేవ్ ని తట్టుకునేందుకు, చిన్నారుల్లో కరోనా లక్షణాలు కనిపెట్టి, వెంటనే చికిత్స చేసేలా చర్యలు తీసుకునేందుకు 15 మంది సభ్యులతో ప్రత్యేక కార్యదళాన్ని నియమించింది. యూపీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ కూడా ఇదే బాటలో ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో మూడో దశ ఉద్ధృతి అనివార్యమేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల స్పష్టం చేసింది. సెకండ్‌ వేవ్‌ నుంచి పాఠాలు నేర్చుకుని మూడో దశ ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొంది. వైరస్‌లో మార్పులు, రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటున్న మ్యుటేషన్లపై కూడా సమర్థంగా పనిచేసేలా వ్యాక్సిన్ల ఫార్ములాలో అప్‌ డేట్లు తీసుకురావడం అవసరమని చెప్పింది. థర్డ్‌ వేవ్‌ లో కరోనాతో పోరాడటానికి ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ ను సిద్ధం చేసుకోవాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి సూచించింది. సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి మూడోవేవ్‌ విరుచుకుపడే ప్రమాదమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోగా పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని, కోవిడ్‌-19 నిబంధనలే చిన్నారుల ప్రాణాలకు రక్ష అని పేర్కొంటున్నారు.Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *