`మేఘా` ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు వ‌చ్చేశాయి.. | teluguglobal.in

May 22, 2021 0 Comments


ఇక నుంచి రోజుకు 15 కోట్ల లీట‌ర్ల ఆక్సిజ‌న్‌ను ఉచితంగా ఆస్ప‌త్రుల‌కు అందించ‌నున్న మేఘా.
భారత్ లో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నా, దాన్ని ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు అవసరమైన క్రయోజనిక్ ట్యాంకర్లు మనకు అందుబాటులో లేవు. రవాణా సదుపాయాలు కూడా అంతంతమాత్రమే. దీంతో సహజంగానే ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా ఆలస్యం అయి, రోగులకు ప్రాణాపాయం ఏర్పడుతోంది. ఒకవేళ క్రయోజనిక్ ట్యాంకర్ ని దేశీయంగా తయారు చేయాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. దీంతో దిగుమతి ఒక్కటే ఏకైక ప్రత్యామ్నాయంగా మారింది. అయితే ఇతర దేశాలనుంచి ట్యాంకర్లను దిగుమతి చేసుకోవడం అంత సులభమైన పని కాదు. కానీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ.. భారీ స్థాయిలో క్రయోజనిక్ ట్యాంకర్ల దిగుమతికి రంగం సిద్ధం చేసింది.

ఈ రోజు థాయిల్యాండ్ నుంచి మూడు ట్యాంక‌ర్లు దిగుమ‌తి చేసుకున్న మేఘా
తొలి విడతగా 3 క్రయోజనిక్ ట్యాంకర్లు థాయిల్యాండ్ నుంచి నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. ఆర్మీ ప్రత్యేక విమానంలో వీటిని బ్యాంకాక్ నుంచి నేరుగా బేగంబేట విమానాశ్రయానికి తీసుకు వచ్చినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. మలి విడతలో మరో 8 ట్యాంకర్లు వస్తాయి. ఒక్కో ట్యాంకు ద్వారా దాదాపు 1 కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ అందించే అవకాశం ఉందని, మొత్తం 11 ట్యాంకర్ల నుంచి ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయొచ్చని ఆయన చెప్పారు. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. క్రయోజనిక్ ట్యాంకర్ల దిగుమతి వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అయితే ఆక్సిజన్ సరఫరాకు అసలు సమస్య క్రయోజనిక్ ట్యాంకర్లు కావడంతో.. వాటిని యుద్ధప్రాతిపదికన మేఘా సంస్థ దిగుమతి చేసుకుంటోంది. ఇతర ఏరాష్ట్రంలోనూ లేని విధంగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను తెలంగాణ ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ఇతర రాష్ట్రాలలోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను క్రయోజనిక్ ట్యాంక్ ల ద్వారా తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు అందజేస్తారు.

ఇప్ప‌టికే మూడు కోట్ల లీటర్ల ఆక్సిజన్ సరఫరా
ఇక స్థానికంగా బొల్లారంలోని ఎంఈఐఎల్ ప్లాంట్ లో ఆక్సిజన్ ను నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ఐసీయూ బెడ్స్ ఉన్న ఏ ఆస్పత్రినుంచి అయినా ఖాళీ సిలిండర్లు తెచ్చుకుంటే.. వాటిలో ఆక్సిజన్ ఉచితంగా నింపి సరఫరా చేస్తున్నారు. పూర్తిగా కొవిడ్ రోగుల చికిత్స కోసమే దీన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క సిలిండర్ సామర్థ్యం 7వేల లీటర్లు కాగా రోజుకు సరాసరిన కనీసం 10 ఆసుపత్రులకు 40 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. మే 9 నుంచి 21వ తేదీ వరకు 29,694 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఎంఈఐఎల్ ఇలా ఆస్పత్రులకు సరఫరా చేసింది. అంటే దాదాపుగా 2 కోట్ల 97 లక్షల లీటర్ల ఆక్సిజన్ పంపిణీ చేశారన్నమాట. మొత్తం 4242 ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు వితరణగా మేఘా సంస్థ అందించింది. ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ఎంఈఐఎల్ ప్రత్యేకంగా ఒక బందాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఆస్పత్రుల అవసరాలు తీర్చడానికి, ఇతర సహాయ కార్యక్రమాలకోసం ఈ టీమ్ రోజులో 24గంటలు అందుబాటులో ఉంటుంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *