ఎన్నికలంటేనే భయపడుతున్న ఈసీ.. | teluguglobal.in

May 14, 2021 0 Comments


ఎన్నికలు పెట్టి దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడానికి పరోక్ష కారణం అయ్యారని, మీపై హత్యానేరం మోపి ఎందుకు విచారణ చేయకూడదంటూ ఎన్నికల కమిషన్ పై మద్రాస్ హైకోర్టు ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కింది. కరోనా సెకండ్ వేవ్ మొదలవుతున్న దశలో 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం సహా.. పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించింది. అదే సమయంలో పలుచోట్ల స్థానిక ఎన్నికలనూ రాష్ట్ర ఎన్నికల సంఘాలు నిర్వహించాయి. సరిగ్గా ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా పెరిగింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది కూడా మృత్యువాత పడిన సందర్భాలున్నాయి, ఇక సభలు, ప్రచార ర్యాలీల్లో గుంపులు గుంపులుగా పాల్గొన్న సగటు ప్రజల పరిస్థితి చెప్పేదేముంది.

హత్యాభియోగాలు మోపుతామంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియా హైలెట్ చేయడంతో ఇబ్బంది పడిన ఎన్నికల కమిషన్.. సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. అయితే ఈ కేసుని కొట్టివేస్తూ సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్న అంశాల్లో న్యాయస్థానాలు కొంత నిగ్రహం పాటిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించింది.

ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు, భవిష్యత్ లో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా.. ఏపీ, తెలంగాణలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిరవధికంగా వాయిదా వేసింది. జూన్-3 నాటికి తెలంగాణలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. వీటని భర్తీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇటు ఏపీలో కూడా మే-31నాటికి 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఇవి కూడా ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిన ఎన్నికలే. ఎమ్మెల్యే కోటా ఎన్నికలంటే పెద్ద హడావిడి ఏమీ ఉండదు, ఎమ్మెల్యేలే ఓటర్లు కావడంతో ప్రచార ఆర్భాటాలు, పోలింగ్ ఇబ్బందులు, లెక్కింపు కష్టాలు ఉండవు. అయితే ఎన్నికల సంఘం మాత్రం కరోనా పేరు చెప్పి వాటిని వాయిదా వేసింది. ఏపీ, తెలంగాణలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, పరిస్థితి కుదుట పడిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికలంటేనే ఈసీ వెనకడుగేసే పరిస్థితి నెలకొంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *