బాబు విషప్రచారంతో ఏపీలో భయాందోళనలు.. | teluguglobal.in

May 7, 2021 0 Comments


పక్క రాష్ట్రంలో కూర్చున్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ పై చేస్తున్న విషప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్ 440-కె అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని, రాజకీయం కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని, ఇలాంటి సమయంలో బాధ్యతగల ప్రతిపక్షనేతగా చంద్రబాబు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి, కొత్త వేరియంట్ అంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగించడం సరికాదని అన్నారు సజ్జల. చంద్రబాబు చేస్తోన్న విషప్రచారానికి ఆయనపై కేసులు పెట్టాలని ధ్వజమెత్తారు. ప్రజలు ఎక్కడికక్కడ బాబు నిలదీయాలన్నారు.

బాబు వల్లే ఏపీపై ట్రావెల్ బ్యాన్..
ఎన్‌ 440-కె అంత ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అసలు ఏపీలో ఆ వేరియంట్ లేదని క్లారిటీ ఇస్తున్నా కూడా చంద్రబాబు విషప్రచారం మానుకోలేదని చెప్పారు సజ్జల. సీసీఎంబీ, సెంట్రల్ బయో టెక్నాలజీలు.. ఈ స్ట్రెయిన్‌ తో ప్రమాదం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయని గుర్తు చేశారు. కొత్త వేరియంట్‌ అంటూ బాబు అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధం విధించాయని అన్నారు. తెలుగు రాష్ట్రాలనుంచి ఢిల్లీకి వెళ్లే విమాన ప్రయాణికులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి కారణం కేవలం చంద్రబాబు చేసిన విష ప్రచారమేనని అన్నారు సజ్జల. ప్రభుత్వం ఏం మంచి చేసినా విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటైందని అన్నారు. బాబు ఏం చేసినా ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు ఉందని అన్నారు సజ్జల.

వ్యాక్సినేషన్ లో ఏపీ రికార్డు గుర్తు లేదా..?
ఒక్క రోజులోనే ఏపీలో 6 లక్షలమందికి టీకా అందించిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని గుర్తు చేశారు సజ్జల. సకాలంలో వ్యాక్సిన్ అందిస్తే.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే సామర్థ్యం ఏపీకి ఉందని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని, టీకా డోసులకోసం ఎప్పటికప్పుడు కేంద్రానికి సీఎం లేఖలు రాస్తున్నారని చెప్పారు. వ్యాక్సిన్లు ఎవరి నియంత్రణలో ఉన్నాయో చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *