ముంబైని మించిన ఢిల్లీ.. కుంభమేళా ఖాతాలో 2వేల కేసులు

April 15, 2021 0 Comments


దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. ముంబైలో జనతా కర్ఫ్యూ తరహా ఆంక్షలు అమలు అవుతున్న నేపథ్యంలో అక్కడ కేసులు నెమ్మదించినట్టు తెలుస్తోంది. అయితే కొత్త కేసుల నమోదులో ముంబైని ఢిల్లీ మించిపోయింది. ఏప్రిల్‌ 4న ముంబైలో అత్యధికంగా 11,163 కేసులు నమోదు కాగా.. గడచిన 24గంటల్లో ఢిల్లీలో 17వేల కేసులు బయటపడ్డాయి. ఏకంగా 100మంది ప్రాణాలు వదిలారు. దేశంలో కరోనా బయటపడిన తర్వాత ఈ స్థాయిలో కేసులు, మరణాలు ఒకే నగరంలో వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకు ఢిల్లీలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 11 వేలకు చేరింది. ఢిల్లీలో ప్రతి 100మందిని పరీక్ష చేస్తే సుమారు 16మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అవుతోంది. కేవలం 10రోజుల్లోనే ఢిల్లీలో పాజిటివ్ కేసులు 234 శాతం పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈసారి ఢిల్లీలో యువత ఎక్కువగా కరోనాబారిన పడుతోందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలో కూడా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

కుంభమేళా ఖాతాలో 2వేల కేసులు..
ఉత్తరాఖండ్ ‌లోని హరిద్వార్‌ లో జరిగిన కుంభమేళాలో కరోనా పడగ విప్పింది. కేవలం 5రోజుల వ్యవధిలోనే అక్కడ 1701 మందికి కరోనా నిర్థారణ అయినట్టు చెబుతున్నారు అధికారులు. కుంభమేళా ప్రారంభం తర్వాత ఏప్రిల్ 10నుంచి 14వరకు 2,36,751 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1701మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. వీరిలో సాధువులు, భక్తులు, స్థానికులు కూడా ఉన్నారు. మరికొన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు వస్తే కేసుల సంఖ్య కచ్చితంగా 2వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

గుజరాత్, తెలంగాణ, పంజాబ్ లో పరీక్షలకు బ్రేక్..
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ నిర్వహించే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా టెన్త్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు వాయిదా వేసింది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం మే 10నుంచి జరగాల్సిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. 1 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తామని తెలిపింది. పంజాబ్ సర్కారు కూడా 5, 8, 10 తరగతుల విద్యార్థులను పరీక్షల్లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా ఒకరోజు కేసులు 2లక్షలు దాటడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *