టార్గెట్ జానారెడ్డి.. అనుముల సభలో కేసీఆర్ ఫైర్..

April 15, 2021 0 Comments


నాగార్జున సాగర్ లో కేసీఆర్ తమ టార్గెట్ ఎవరో చెప్పేశారు. బీజేపీని పూచిక పుల్ల తీసి పారేసినట్టు పక్కనపెట్టారు. నల్గొండ జిల్లా అనుములలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ కి 30ఏళ్లుగా ఆయన చేసిందేమీ లేదని, కనీసం హాలియాకు డిగ్రీ కాలేజీ కూడా తీసుకు రాలేకపోయారని విమర్శించారు. నోముల నర్సింహయ్య చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి తమ అభ్యర్థి నోముల భగత్ కి పట్టం కట్టండని పిలుపునిచ్చారు.

నా సీఎం పదవి ప్రజల భిక్ష..
కేసీఆర్ కు సీఎం పదవి జానారెడ్డి పెట్టిన భిక్ష అంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అనుముల సభలో ఘాటుగా స్పందించారు కేసీఆర్. జానారెడ్డికి సీఎం పదవి ఇస్తే.. ఆయన దాన్ని అమ్ముకునేవారే కానీ తనకు ఇచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం తెలంగాణను ఆంధ్రావాళ్లకు తాకట్టు పెట్టారని, కానీ ప్రత్యేక తెలంగాణ కోసం తానే పదవులు విసిరి పారేశానన్నారు. “ఉద్యమం మొదలుపెట్టినప్పుడే ఉప సభాపతి, ఎమ్మెల్యే పదవులను వదులుకున్నా. నిరాహార దీక్ష కొనసాగిస్తే ప్రాణం పోతుందని వైద్యులు హెచ్చరించినా వినకుండా చావు నోట్లో తలపెట్టా. దాని వల్లే మన రాష్ట్రం వచ్చింది. అరవై ఏండ్ల పాలనలో తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే కాంగ్రెస్‌ నాయకులే కారణం. వారు సరిగా ఉంటే గులాబీ జెండా ఎగరాల్సి వచ్చేదే కాదు. పదవుల కోసం వారు పెదవులు మూసుకున్నారు.” అని విమర్శించారు కేసీఆర్.

ఆంధ్రాకంటే తెలంగాణే టాప్..
బల్లగుద్ది.. రొమ్ము విరిచి.. కాలర్‌ ఎగరేసి చెబుతున్నా.. దేశంలో ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసింది తెలంగాణే అని అన్నారు కేసీఆర్. ఆంధ్ర ప్రదేశ్ 29 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమైందని, అభివృద్ధిని చూసీ చూడనట్లు ఉండొద్దని, ఓట్ల రూపంలో మద్దతు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు వదిలేసిన తిరుమలగిరి సాగర్‌ లిఫ్ట్ , నెలికల్లు లిఫ్ట్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, కడారి అంజయ్యకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అసంతృప్తులను, వారి అనుచరుల్ని బుజ్జగించారు.

నల్గొండ సెంటిమెంట్..
నల్గొండ జిల్లాపై తాను రాసిన పాటను అనుముల సభలో గుర్తు చేస్తూ సెంటిమెంట్ పండించారు కేసీఆర్. “ఏ మాయనే నల్లగొండా.. నీ గుండెల నిండా ఫ్లోరైడ్‌ బండా” అనే పాట తానే రాశానని చెబుతూ దాన్ని స్టేజ్ పై ఆలపించి ప్రజలను ఉత్సాహ పరిచారు. అనుముల సభ జరగకూడదని.. కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్నినా, కోర్టులకెక్కి అడ్డుకోవాలని చూసినా.. ఏదీ సాధ్యం కాలేదని, అలాగే.. ఎన్నికల్లో వారి గెలుపు కూడా సాధ్యం కాదని అన్నారు కేసీఆర్.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *