తిరుమలలో సర్వదర్శనం రద్దు.. | teluguglobal.in

April 8, 2021 0 Comments


కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఇటీవలే షిరిడీ ఆలయం పూర్తిగా మూతబడగా.. తాజాగా తిరుమలలో సర్వదర్శనం రద్దు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈనెల 12నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి వరకు టోకెన్లు ఉన్నవారు యథావిధిగా శ్రీవారి దర్శనానికి రావొచ్చని చెప్పింది. అయితే 12వతేదీ తర్వాత కూడా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు య‌థావిధిగా కొనసాగుతాయని టీటీడీ వెల్ల‌డించింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. తిరుమలకు వచ్చే భక్తులపై ఆంక్షలు విధించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దర్శనాలపై పరిమితులు విధించారు అధికారులు. తిరుపతి నగరంలో భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో సర్వదర్శన టైం స్లాట్‌ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు, సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడంతో.. దర్శనాలను నిలిపివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 12వతేదీనుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తారు, అంటే అదే రోజు నుంచి దర్శనాలు కూడా రద్దవుతాయనమాట. తిరిగి టోకెన్లు ఎప్పటినుంచి ఇస్తారనే విషయంపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేస్తుందని తెలిపారు.

ఆర్జిత సేవలు కూడా ఇప్పట్లో లేనట్టే..
లాక్ డౌన్ కారణంగా గతేడాది మార్చి 20నుంచి తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడంలేదు. ఇటీవల పరిస్థితులు కాస్త కుదుటపడటంతో.. ఏప్రిల్ 14నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపారు. అయితే సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో వాటిపై కూడా ఆంక్షలు విధించారు అధికారులు. ఈనెల 14నుంచి ప్రారంభం కావాల్సిన ఆర్జిత సేవలను నిలిపివేశారు. ఇప్పుడు సర్వదర్శనం టోకెన్ల జారీ కూడా ఆపివేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వస్తే అప్పుడు దర్శనాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *