లక్ష్మణ రేఖ దాటేశాం.. ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు..

March 28, 2021 0 Comments


ఏపీలో ఒకేరోజు కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండగా.. తాజాగా వెయ్యి మార్కు కూడా చెరిపేశాం. ఆదివారంతో ఆ గీత దాటేశాం. గడచిన 24గంటల్లో ఏపీలో 1005 కరోనా కేసులు వెలుగు చూశాయి. మొత్తం 31,142మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కేసులు వెయ్యి దాటడం ఆందోళన కలిగించే అంశం. దీంతో ఇప్పటి వరకూ ఏపీలో బయటపడిన కరోనా కేసుల సంఖ్య 8,98,815కి చేరినట్టయింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది.

కేసుల సంఖ్య పెరుగుతున్నా.. గతంలో లాగే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు.. మొత్తం ఇద్దరు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ ఏపీలో కరోనా మరణాలు 7,205కి చేరుకున్నాయి.
ఇక రాష్ట్రవ్యాప్తంగా గడచిన 24గంటల్లో 324మంది బాధితులు కరోనానుంచి కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,394గా తేలింది. తొలి విడతలో మోతమోగించిన గుంటూరు జిల్లాలో సెకండ్ వేవ్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో నమోదయిన వెయ్యి కేసుల్లో దాదాపు పావుశాతం అంటే.. 225కేసులు ఒక్క గుంటూరులోనే నమోదయ్యాయి. చిత్తూరు 184కేసులు, విశాఖపట్నం 167కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. అటు తెలంగాణలో కూడా కరోనా కేసులు స్పీడందుకున్నాయి. కానీ కేసుల సంఖ్యలో తెలంగాణకంటే ఏపీ బాగా ముందుకెళ్లిపోయింది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 535 కేసులు నమోదు కాగా, ముగ్గురు కరోనాతో మరణించారు.

దేశవ్యాప్తంగా సగటున రోజుకి 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వాటిలో సగానికంటే ఎక్కువగా మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. మొత్తమ్మీద సెకండ్ వేవ్ ప్రభావం భారత్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రంగానే కనిపిస్తోంది. పెరిగే కేసులతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *