సీఐడీ ఎపిసోడ్ తో బీజేపీ సంతోషం..

March 17, 2021 0 Comments


చంద్రబాబుకి సీఐడీ నోటీసులివ్వడం కక్షసాధింపు చర్యలంటూ టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న వేళ, చంద్రబాబు చట్టాలకు అతీతుడా అంటూ వైసీపీ నేతలు విమర్శలందుకున్నారు. అయితే ఈ సీఐడీ ఎపిసోడ్ లో తన సంతోషాన్ని తాను వెదుక్కుంది రాష్ట్ర బీజేపీ. టీడీపీ చేస్తున్న కక్షసాధింపు ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో నల్ల జెండాలు చూపి నిరసన తెలిపిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అప్పుడు చంద్రబాబు చేసిన పనులు రాజకీయ కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు వీర్రాజు.

అమరావతి భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని బీజేపీ మొదటినుంచీ వాదిస్తోంది. మూడు రాజధానులకు మద్దతిస్తాం, అదే సమయంలో అమరావతి రైతులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ దశలో అమరావతి భూముల వ్యవహారంపై సీఐడీ తేనెతుట్టె కదపడంతో పరోక్షంగా బీజేపీ సీన్ లోకి వచ్చింది. చంద్రబాబుకు సీఐడీ నోటీసుల జారీపై స్పందించను అంటూనే వీర్రాజు రాజకీయ కక్షసాధింపుపై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ–జనసేన కూటమికి ముందుకెళ్తుందని అన్నారాయన.

పవన్ మౌనం.. సీపీఐ వ్యూహాత్మక మౌనం..
చంద్రబాబుకి సీఐడీ నోటీసులపై పవన్ మౌనాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఆయన స్పందించలేదు. జనసేన తరపున కూడా ఎవరూ మాట్లాడలేదు. అమరావతి విషయంలో అక్రమాలు జరిగాయని గతంలో విమర్శించిన జనసేనాని, సీఐడీ విచారణను సమర్థించలేదు, అటు రాజకీయ కక్షసాధింపుల ఆరోపణలకి కూడా మద్దతివ్వలేదు.

ఇక సీపీఐ మాత్రం ఈ వ్యవహారంలో వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించింది. చంద్రబాబుపై ఈగ వాలనివ్వని సీపీఐ రామకృష్ణ కూడా సీఐడీ కేసుల గురించి మాట్లాడలేదు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూముల వ్యవహారం కావడంతో సీపీఐ జోక్యం చేసుకోలేదని తెలుస్తోంది. రాగా పోగా.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్కరే చంద్రబాబుకి మద్దతు తెలిపారు. అరాచకం పార్ట్-2 మొదలైందని అన్నారు. బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా తమ మాజీ బాస్ కి సీఐడీ నోటీసులిచ్చిన వ్యవహారంపై స్పందించకపోవడం విచిత్రం.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *