మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు..

March 17, 2021 0 Comments


అమరావతి భూముల వ్యవహారంలో నిన్న మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులిచ్చారు సీఐడీ అధికారులు. ఈనెల 23న విజయవాడ సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా మాజీ మంత్రి నారాయణకు చెందిన ఇళ్లు, ఆయన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సీఐడీ సోదాలు మరింత కలకలం రేపాయి. నారాయణ, ఆయన బంధువులకు చెందిన ఇళ్లపై 10 ప్రాంతాల్లో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్.. ఇలా అన్ని ప్రాంతాల్లో సీఐడీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

నారాయణే కీలకం..
చంద్రబాబు హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ చక్రం తిప్పారు. అమరావతి వ్యవహారాలను కూడా పూర్తిగా ఆయనకే అప్పగించారు చంద్రబాబు. క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన నారాయణ, భూసేకరణ, పరిహారం వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవారు. అమరావతి డిజైన్ల కమిటీలలో కూడా నారాయణే కీలకం. దీంతో చంద్రబాబు సహా ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో నారాయణే తొలి వ్యక్తిగా నిలిచారు. నారాయణ బంధువులు, ఆయన విద్యా సంస్థల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ మహిళ కూడా ఇక్కడ భూములు కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను కారు చౌకగా కొట్టేయడంతోపాటు, వాటిని ప్రభుత్వానికి అప్పగించి పరిహారం పొందిన వ్యవహారంలో సీఐడీ కేసులు నమోదు చేసింది. అలా పరిహారం అందుకోవడం ఒక్కసారే చెల్లుబాటయ్యేలా జీవో తీసుకొచ్చి మరీ ఎస్సీ, ఎస్టీలను దారుణంగా మోసం చేశారు. ఇలా మోసం చేసినవారులో రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు, అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఈ వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా బయటపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఆ తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన వద్దకు వచ్చిన బాధితులతో కలసి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసి, చంద్రబాబు, నారాయణను విచారణకు పిలిచారు. తాజాగా నారాయణ ఇంట్లో సోదాలు చేశారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *