గ్రహాలన్నీ కమల్ కి అనుకూలంగా.. | teluguglobal.in

March 13, 2021 0 Comments


అనారోగ్యం కారణంగా చూపి రజినీకాంత్ తమిళనాట రాజకీయ పార్టీ పెట్టకుండానే పోటీనుంచి తప్పుకున్నారు. అయితే ఓటమి భయంతోనే ఆయన వెనకడుగేశారని అంటారు చాలామంది. కారణం ఏదయినా, సినిమాల ద్వారా వచ్చిన ఇమేజ్ ని రాజకీయాల్లో చేరి చెడగొట్టుకోవడం రజినీకి ఇష్టంలేదు. అందుకే ఆయన పాలిటిక్స్ దూరంగా ఉంటూ వచ్చారు, దూరంగానే ఉండిపోయారు. అయితే ఆయన సహ నటుడు కమల్ హాసన్ మాత్రం తాడో పేడో తేల్చుకోందే పోనంటూ టార్చిలైటు గుర్తుతో హడావిడి చేస్తున్నారు. పోటీనుంచి విరమించుకున్న రజినీ గొప్పవాడా, పోటీలో దిగి కాస్తో కూస్తో ప్రయత్నం చేస్తున్న కమల్ గొప్పవాడా అనే విషయం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఒకవేళ కమల్ పార్టీ దారుణంగా దెబ్బతింటే.. రజినీయే సరైన నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. అయితే ఇక్కడ గ్రహాలన్నీ కమల్ హాసన్ కి అనుకూలంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ముందే లోకనాయకుడు జాక్ పాట్ కొట్టారని అనుకోవాలి. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా కమల్ అసెంబ్లీవైపు బలమైన అడుగులు వేస్తున్నారనే విషయం తేలిపోయింది.

కోయంబత్తూరు సౌత్ నుంచి ఈసారి డీఎంకే, అన్నాడీఎంకే రెండూ పోటీ చేయడంలేదు. వరుసగా రెండు సార్లు అక్కడ అన్నాడీఎంకే అభ్యర్థి గెలిచినా కూడా.. ఆ సీటుని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించింది ఆ పార్టీ. దీంతో అక్కడ అన్నాడీఎంకే కార్యకర్తలు అధినాయకత్వంపై రగిలిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరం జరిగారు. ఈ దశలో అన్నాడీఎంకే ఓట్లు.. కమల్ వైపు తిరిగితే ఆయన పంట పండినట్టే. బీజేపీతో కమల్ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇక డీఎంకేకి ఇక్కడ ఎలాగూ బలం తక్కువేనని గత ఎన్నికలు రుజువు చేశాయి. దీంతో ఈ సీటుని కాంగ్రెస్ కి త్యాగంచేయాలనే ఆలోచనలో ఉన్నారట ఆ పార్టీ నేతలు. రెండు మూడు రోజుల్లో ఈ విషయం కన్ఫామ్ అయితే ఇక కమల్ గెలుపు నల్లేరుపై నడకలాంటిదేనని అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ లలో ఎవర్నీ ఎంచుకోకుండా.. కోయంబత్తూర్ సౌత్ ప్రజలు కమల్ కే పట్టం కట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2019 సార్వత్రి ఎన్నికల్లో ఇక్కడ కమల్ హాసన్ పార్టీకి కోయంబత్తూరు లోక్ సభ పరిధిలో 11శాతం ఓట్లు లభించాయి. అంటే.. కోయంబత్తూర్ సౌత్ లో కూడా కమల్ పార్టీ ప్రభావం కాస్తో కూస్తో ఉందనే విషయం అర్థమైపోతోంది. అన్నీ అనుకూలిస్తే.. కమల్ హాసన్ తొలిసారి పోటీతోనే తమిళనాడు అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారనమాట.

దినకరన్ పార్టీతోనే కమల్ కి పోటీ..
శశికళ రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా.. ఆమె తరపున టీటీవీ దినకరన్ హడావిడి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నుంచి దొరై స్వామి అనే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనను అడ్డుకోగలిగితే కమల్ విజయాన్ని ఇంకెవరూ ఆపలేరు. దాదాపుగా పోటీలో దిగకుండానే కమల్ సగం పని పూర్తి చేశారు. ఇక ఎన్నికల బరిలో దిగి చక్రం తిప్పితే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *