ఏపీలో జండర్ బడ్జెట్.. మహిళలకు సీఎం జగన్ శుభవార్త..

March 8, 2021 0 Comments


మహిళా దినోత్సవ సందర్భంగా ఏపీలోని గృహిణులకు, మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. దేశంలోనే తొలిసారిగా జండర్ బడ్జెట్ తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ అన్ని రంగాలకు బడ్జెట్ కేటాయింపులుండేవి. ఇకపై ఆ కేటాయింపుల్లో మహిళల వాటా ప్రత్యేకంగా ప్రకటిస్తారు. మహిళా సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్ ని పూర్తిగా వారి అవసరాలకే వినియోగించేలా చూస్తారు. జండర్ బడ్జెట్ అమలులోకి వస్తే.. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అది. ఓ విప్లవాత్మక మార్పుకి శ్రీకారం చుట్టినట్టేనని చెప్పాలి. ఇప్పటి వరకూ ఎవరూ జండర్ బడ్జెట్ గురించి ఆలోచించలేదు, తొలిసారిగా జండర్ బడ్జెట్ తో ఏపీ రికార్డు సృష్టించబోతోంది.

మహిళా ఉద్యోగులకి కూడా..
మహిళా ఉద్యోగులకు ఇకపై క్యాజువల్ లీవులు 15నుంచి 20వరకు పెంచబోతున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో మహిళలపై వేధింపుల నివారణ కమిటీ లేదని, తొలుత సచివాలయంలోనే ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఇతర కార్యాలయాల్లో కూడా కమిటీలు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

మహిళా దినోత్సవం సందర్భంగా దేశానికి దిశ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం జగన్. 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌ మెంట్‌ వెహికల్స్‌ ను సీఎం ప్రారంభించారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను ఆవిష్కరించారు. బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్ లాంఛనంగా‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను వివరించారు సీఎం జగన్. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చామని చెప్పారు.

గతంలో చంద్రబాబు మహిళల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారని అన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *