పార్టీపై బాబు పట్టు కోల్పోతున్నారా..? | teluguglobal.in

March 7, 2021 0 Comments


తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు పట్టు కోల్పోతున్నారా..? నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ తప్పారా? అధినేత మాటకి విలువ లేకుండా పోతోందా..? 2019లో ఘోర పరాభవం తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాలనే రుజువు చేస్తున్నాయి. తాజాగా విజయవాడ ఘటనతో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటతో పార్టీలో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా తేలిపోయింది.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను 23మందిని టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో కొంతమందికి మంత్రిపదవుల ఆశ చూపించారు, మరికొందరిని స్థానిక సమస్యల బూచి చూపి భయపెట్టి మరీ చేర్పించుకున్నారనే అపవాదు ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వైసీపీ ఎవరికీ ఆహ్వానం పలకడంలేదు. పైగా ఎవరూ తమ పార్టీలోకి రావొద్దని, ఒకవేళ రావాలంటే.. కచ్చితంగా పాత పార్టీతోపాటు, పదవికి కూడా రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ని కాదనలేక, ఇటు టీడీపీతో కలసి ఉండలేక, భవిష్యత్ పై బెంగతో ఆల్రడీ నలుగురు గోడ దూకారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా తమ పెత్తనం సాగదని తెలిసి కూడా వారు జగన్ వైపు చూశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీడీపీని మునిగిపోయే నావలా భావించారు కాబట్టే ప్రతిఫలం తక్కువగానే ఉన్నా వారంతా ప్లేటు ఫిరాయించారు.

మిగిలినవారి సంగతేంటి..?
పోనీ మిగిలిన ఎమ్మెల్యేలయినా చంద్రబాబు కంట్రోల్ లో ఉన్నారా అంటే తెలియని పరిస్థితి. ఉత్తరాంధ్రలో ఉక్కు ఉద్యమం జరుగుతుంటే మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఎవరికి వారే, యమునా తీరే అన్నట్టున్నారు. గంటా సొంతంగా రాజీనామా లేఖ రాసి, తన రూటే సెపరేటు అని చెప్పారు. ఉక్కు ఉద్యమంకోసం చంద్రబాబు విశాఖకు వచ్చినా కూడా గంటా అంటీ ముట్టనట్టే ఉన్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలదీ తలోదారి. దీంతో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ మాజీ ఎమ్మెల్యే నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి.

రాయలసీమలో చంద్రబాబు సహా గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పయ్యావుల కేశవ్. బాలయ్య సినిమాలతో బిజీగా ఉండగా.. ఇటీవలే ఆయ చంద్రబాబు బలవంతంపై ప్రచారంలో దిగి అభ్యర్థులను ఇరకాటంలో పెట్టిన విషయం తెలిసిందే. అటు పయ్యావుల కేశవ్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

ఇక చంద్రబాబు అధికారంలో ఉండగా.. మంత్రులుగా చక్రం తిప్పిన వారిలో ఎంతమంది టీడీపీని అంటి పెట్టుకుని ఉన్నారో వేళ్లపై లెక్కబెట్టొచ్చు. మాజీ మంత్రి నారాయణ అధికారంలో ఉన్నప్పుడు అంతా తానై నడిపిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు పార్టీ వ్యవహారాల్లో ఆయన ప్రాతినిధ్యమే లేదు. ఇలా చాలామంది తలోదారి చూసుకున్నారు. మిగిలిన వారిలో కొంతమంది బెజవాడలో లాగా రచ్చకెక్కి గొడవ చేస్తున్నారు. గతంలో కనుచూపుతోనే పార్టీ నాయకుల్ని కంట్రోల్ లో పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పట్టు కోల్పోయే స్థితికి చేరుకున్నారనే వాదన వినపడుతోంది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *