రాజధాని తరలింపుపై తొలి అడుగు పడినట్టేనా..?

March 4, 2021 0 Comments


పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినా, కోర్టు కేసుల నేపథ్యంలో జగన్ సర్కారు ముందడుగు వేయలేకపోతోంది. గతంలో సీఎం గెస్ట్ హౌస్ నిర్మాణ సమయంలో కోర్టు అడ్డు చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం కొన్నాళ్లపాటు వేచి చూసింది. అయితే న్యాయపరమైన చిక్కులు లేని అంశాల్లో వడివడిగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ విశాఖలో నిర్మించేందుకు పాలనా పరమైన అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్ ఈ అనుమతులు జారీ చేస్తూనే.. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కి సూచించారు.

తరలింపు కాదు.. ఏర్పాటు..
ఒకచోట ఉన్న ఆఫీస్ ని ఇంకోచోట ఏర్పాటు చేస్తే దాన్ని తరలింపు అంటారు. కొత్త నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న దాన్ని కొత్తగా మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తే దాన్ని నూతన ఏర్పాటు అంటారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కోర్టు కేసులున్నా రాజధాని తరలిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను వారు ఖండిస్తున్నారు. గతంలో విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకి కేవలం ప్రతిపాదనలు మాత్రమే సిద్ధమయ్యాయని, గత ప్రభుత్వం రూ.13.80 కోట్లు నిధులు మంజూరు చేసినా, వాటి విడుదలలో జాప్యం అయిందని వివరణ ఇచ్చారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో నూతనంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో దీన్ని నిర్మించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతులు మంజూరు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అక్కడి సీసీ కెమెరాలు లేదా డ్రోన్ల ద్వారా వీడియో ఫుటేజ్‌ తీసుకుని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉంది. వాటన్నిటినీ అనుసంధానం చేస్తూ కొత్తగా విశాఖలో ఏపీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నారు.

త్వరలో ఆర్టీసీ హౌస్‌..
ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్పీ ఠాకూర్.. విశాఖలో ఆర్టీసీ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసి హౌస్ నిర్మించింది. అయితే ప్రస్తుతం దీన్ని కూడా విశాఖకు తరలిస్తారని వార్తలొస్తున్నాయి. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీ హౌస్ వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. మొత్తమ్మీద పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తో విశాఖలో పాలనా పరమైన తొలి అడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ, మలి అడుగు ఏ డిపార్ట్ మెంట్ నుంచి ఉంటుందనేది ఆసక్తిగా మారింది.


Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *